రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర విషయాలు..
వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు శునకాలపై ఉన్న ప్రేమ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీధి శునకాలకు ఆశ్రయం కల్పించిన గొప్ప హృదయం ఆయనది. కాగా తన పెంపుడు శునకం టిటోతో రతన్ టాటా అనుబంధనం మాటల్లో చెప్పలేనిది. తాజాగా రతన్ టాటా వీలుమానాలో పెంపుడు శునకం కోసం ప్రత్యేక స్థానం కేటాయించినట్లు తెలుస్తోంది..
ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటా లేరన్న వార్త యావత్ దేశాన్ని ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. తన వ్యాపార దక్షతతో టాటా కంపెనీని కోట్లకు పడగలెత్తేలా చేసిన రతన్‌టాటా.. గొప్ప మానవతమూర్తిగా పేరు సంపాదించుకున్నారు. భవిష్యత్ తరాలకు ఆదర్శమూర్తిగా నిలిచారు. రతన్ టాటా అంటే కేవలం కంపెనీలు, లాభాలు, వ్యాపారాలు మాత్రమే కాదని గొప్ప విలువలకు నిలువెత్తు నిదర్శమని చాటి చెప్పారు.
రతన్ టాటాకు మూగ జీవులపై ఎంతో ప్రేమ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీధి శునకాల సంరక్షణ కోసం ఆసుపత్రులను కూడా నిర్మించారు. అంతేనా తాజ్ హోట్ ప్రాంగణంలో వీధి కుక్కలకు ఆశ్రయం కూడా కల్పించారు. ముంబయిలోని 5 అంతస్తుల భవనంలో పెట్ ప్రాజెక్ట్ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. 200 శునకాలకు ఆశ్రయయం కల్పించేలా దీనిని ఏర్పాటు చేశారు. దీనిబట్టే రతన్ టాటాకు శునకాలపై ఉన్న ప్రేమ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక రతన్ టాటా టిటో అనే శునకాన్ని పెంచుకున్న విషయం తెలిసిందే. చనిపోయే ముందు ఆయన రాసిన వీలునామాలో పెంపుడు శునకం టిటోకు ప్రత్యేక స్థానాన్ని కల్పించినట్లు తెలుస్తోంది. టిటో జీవితకాల సంరక్షణ ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని పేర్కొన్నట్లు తెలుస్తోంది. టిటో బాధ్యతలను తన వద్ద ఎంతోకాలంగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్ షాకు అప్పగించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
రతన్ టాటా మొదట టిటో అనే శునుకాన్ని పెంచుకున్నారు.. అయితే ఆ శునకం మరణించిన తర్వాత మరో శునకాన్ని దత్తత తీసుకొని దానికి అదే పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఇక రతన్ టాటా తన వీలునామాలో మూడు దశాబ్దాలుగా తనవద్ద పని చేస్తూ, తోడుగా ఉన్న వ్యక్తిగత సహాయకులు రాజన్ షా, సుబ్బయ్య పేర్లను కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఇక రతన్ టాటా పేరున ఉన్న సుమారు రూ. 10 వేల కోట్ల ఆస్తు.. ఆయన నెలకొల్పిన ఫౌండేషన్లకు, సోదరుడు జిమ్మీ టాటాకు, తన సహాయకులు, ఇతరులకు చెందుతాయని వీలునామాలో రాసినట్లు తెలుస్తోంది.