బెంబెలేత్తిస్తున్న బాంబు బెదిరింపులు..వార్నింగ్ ఇచ్చినా ఆగట్లేదు ..
గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు, కేంద్రపాలిత సంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌కు సైతం గత వారం రోజుల వ్యవధిలో అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి.
కొద్ది రోజుల క్రితం హకీంపేట్‌లో ఉన్న సీఆర్పిఎఫ్ క్యాంపుకు సైతం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో జవహర్ నగర్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఇక తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు శుక్రవారం సైతం మరొక బాంబు బెదిరింపు అలర్ట్ వచ్చింది.
గడచిన వారం రోజుల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌లో బాంబు బెదిరింపు అలర్ట్‌తో పోలీసులు 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అక్టోబర్ 19 నుండి మొదలైన బాంబు అలర్ట్ కంటిన్యూస్‌గా ఐదు రోజులపాటు అలర్ట్ వచ్చింది. అయితే ఈ బెదిరింపులు అన్ని సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ x నుండి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 19న ఏయిర్ ఇండియా, స్పైస్ జెట్, విస్తారా, స్టార్ ఎయిర్, బటిక్ ఎయిర్ ఫ్లైట్ లను పిలుస్తామని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా హెచ్చరిక జారీ చేశారు. ఇక అక్టోబర్ 20న అదే ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఆకాశ ఎయిర్, స్టార్ ఎయిర్ ఫ్లైట్లను సైతం బాంబులతో పేలుస్తామని ఇదే తరహా బాంబు బెదిరింపులు వచ్చాయి.
అక్టోబర్ 22న ఎయిర్ లైన్ సిబ్బందికి ఒక బెదిరింపు వచ్చింది. ఆన్‌బోర్డులో ఉన్న మొత్తం పది ఫ్లైట్లను పేలుస్తామని హెచ్చరించారు. వీటితోపాటు ఇండిగో విస్తారా ఆకాశ ఎయిర్‌కు చెందిన మొత్తం 13 ఫ్లైట్లను పేలుస్తామని అగంతకులు అలర్ట్ పంపించారు. ఇక అక్టోబర్ 24న ఎయిర్ ఇండియా ఇండిగో విమానాలను పేలుస్తామని సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మరొక పోస్ట్ పెట్టారు. అయితే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ వ్యక్తుల కోసం ఇప్పటికే శంషాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. X కు సైతం ఇప్పటికే లేఖలు రాశారు. ఇక తాజాగా శుక్రవారం సైతం హైదరాబాద్ నుండి చండీగర్ వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు అలర్ట్ వచ్చింది. ఫ్లైట్‌ను పేలుస్తామని బెదిరింపు రావడంతో శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయి ఫ్లైట్‌లో ఉన్న 130 మంది ప్రయాణికులను కిందికి దించి తనిఖీలు చేపట్టారు. ఇదే రోజు మొత్తం 20 ఫ్లైట్లకు దేశవ్యాప్తంగా ఇదే రీతిలో బెదిరింపు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ బెదిరింపులపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో 5 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. బీఎన్ఎస్ 353 (2), 351(1) చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.