AP Wine Shop Tenders 2024 :
ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ పూర్తయ్యింది. రేపటి నుంచి కొత్త వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో.. మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియపై మాజీ సీఎం జగన్ చంద్రబాబుకు 7 ప్రశ్నలు సంధించారు. మద్యం మాఫీయాకు ఏపీ అడ్డాగా మారిందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైన్ షాపుల టెండర్లు, కేటాయింపు ప్రక్రియపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ జరిగిందని ఆరోపించారు. టీడీపీ నేతలు, నాయకులే సిండికేట్‌గా ఏర్పడి.. వైన్ షాపులను దక్కించుకున్నారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై చంద్రబాబుకు జగన్ 7 ప్రశ్నలు సంధించారు.
1.’లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబు? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి.. వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్ కాదా? మీ మనుషులతో సిండికేట్ ఏర్పాటు చేసి షాపులను కొట్టేయడం నిజం కాదంటారా? రానున్న ఐదేళ్లలో పెద్దమొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలరీల ద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి.. వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా?’ అని జగన్ ప్రశ్నించారు.
2.’చంద్రబాబు.. మీరు తెచ్చిన లిక్కర్ పాలసీ గొప్పదే అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నిష్పక్షపాతంగా వ్యవహరించిఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ‘నీకింత.. నాకింత’ అని కమీషన్ల వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? లైసెన్స్ ఫీజులతోపాటు కిందనుంచి మీ దాకా కమీషన్లు కోసం, మీవారికి షాపులు ఇవ్వని పక్షంలో బదులుగా వాటాలు సమర్పించడంకోసం లిక్కర్ కొనుక్కున్నవారి జేబులు గుల్లచేయడానికి మీరంతా సిద్ధం అయినట్టేకదా? మీకింత వారికింత చొప్పున నచ్చిన రేట్లకు అమ్ముకోవడానికి సిండికేట్లకు ఓకే చెప్పినట్టే కదా? దీనివల్ల తమ కుటుంబాల్లో చదువుల కోసం, ఇతర బాగోగుల కోసం ఖర్చు కావాల్సిన ప్రజల ఆదాయాలను.. మీ జేబుల్లోకి వేసుకోవడానికి పన్నిన అవినీతి పథకం కాదంటారా చంద్రబాబు?’ అని మాజీ సీఎం ప్రశ్నించారు.
3′.కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రానీయకుండా, మీరు గండికొట్టారు. ప్రజలను మభ్యపెట్టడానికి చీప్ లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించి, దీనికోసం క్వాలిటీని తగ్గిస్తూ, ఇంకోవైపు అమ్మకాలు విపరీతంగా పెంచేసి, తద్వారా డిస్టలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 20 డిస్టలరీల్లో 14 మీ హయాంలో వచ్చినవే. మా హయాంలో ఒక్క డిస్టరీలకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇంకోవైపు ఎమ్మార్పీమీద నియంత్రణ తీసివేసి, మీ వారికి, మీ మాఫియాకు షాపులు అప్పగించి, అక్కడకూడా మీకు ఇంత.. నాకు ఇంత అని ఎమ్మార్పీపైన రేట్లు పెంచి వసూలు చేయడం ప్రజల నడ్డి విరగొట్టడం కాదా చంద్రబాబు?’ అని జగన్ ప్రశ్నించారు.
4.’ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మితే అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది. అమ్మకం వేళలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల మద్యం నియంత్రణ అనే ప్రాథమిక బాధ్యత దిశగా ప్రభుత్వాలు కాస్తైనా పనిచేసినట్టు అవుతుంది. ఇప్పుడు మీ విధానం ద్వారా మీ సొంత ఆదాయం కోసం ఆ లక్ష్యానికి తూట్లుపొడిచినట్టే కదా? ఒక ఫక్తు లిక్కర్ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు కానీ.. రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిలా ఎందుకు ఆలోచన చేయడంలేదు? కారణం ఈ కొత్త పాలసీలో మీ సొంతలాభం ఉండబట్టే కదా?’ అని మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
5.’2014-19 మధ్య ఇదేమాదిరిగా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. ప్రజల ఆరోగ్యాలను, కుటుంబాల పరిస్థితులను పణంగా పెట్టేలా లిక్కర్ పాలసీని తెచ్చి దాని మీద కాసులు ఏరుకున్నారు. అప్పట్లో మీ సిండికేట్లు బడిపక్కన, గుడిపక్కన బెల్టు షాపులు పెట్టిమరీ ప్రతి ఇంటికీ డోర్‌డెలివరీ స్థాయికి పరిస్థితులను తీసుకెళ్లాయి. కాగితాలమీద కనిపించే దుకాణాలే కాకుండా, వాటికి అదనంగా పర్మిట్ రూమ్స్, దీనికి తోడుగా 43వేల బెల్టుషాపులతో లిక్కర్ ఏరులై పారింది. మేము అధికారంలోకి రాగానే అలాంటి దారుణ పరిస్థితులను కూకటి వేళ్లతో పెకలించాం. మద్యం దళారులకు, అందులోని రాజకీయ వ్యాపారులకు చెక్ పెట్టింది. దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించి మద్యం అమ్మకాలను నియంత్రించింది. మళ్లీ రాష్ట్రాన్ని పూర్వపు దారుణ పరిస్థితులకు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా చంద్రబాబు?’ అని జగన్ ప్రశ్నించారు.
6.’లక్షల సంఖ్యలో ఉద్యోగాలంటూ అబద్ధాలుమీద, అబద్ధాలు చెప్పి రోజూ మీ మీడియాలో ఊదరగొట్టే మీరు.. మీ స్వార్థం కారణంగా ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో పనిచేస్తున్న 15 వేల మంది ఒక్కసారిగా నిరుద్యోగులై రోడ్డునపడ్డారు. మరి, వీరి బాగోగుల సంగతేంటి చంద్రబాబు?’ అని మాజీ సీఎం నిలదీశారు.
7.’చంద్రబాబు.. మీ అక్రమార్జనకోసం, మీకు, మీవాళ్లకు అవినీతి డబ్బు సంపాదించడంకోసం మీరు అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం. అక్కచెల్లెమ్మల ఉసురు, యువత ఉసురు, ఆరోగ్యం రూపేణా ప్రజల ఉసురు మీరు పోసుకున్నట్టే. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ఇప్పటికే తిరోగమనం పట్టించారు. అవినీతి ధ్యేయంగా తెచ్చిన లిక్కర్ పాలసీతో రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. మీ చర్యలను వెంటనే సరిదిద్దుకోండి. లేకుంటే ప్రజల తరఫున ఉద్యమిస్తాం’ అని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.